మక్తల్ నియోజకవర్గంలో ఐదు మండలాలపై కాంగ్రెస్ పట్టు

మక్తల్, డిసెంబర్ 18, తెలంగాణ సైన్యం:నియోజకవర్గంలో జరిగిన మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఐదు మండలాల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకొని తమ రాజకీయ బలాన్ని చాటారు.ఈ విజయంపై రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలించిందని అన్నారు.గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్లకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే ఉత్సాహం, ఐక్యతతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయాన్ని కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్లను మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్లో నేడు ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
